జగిత్యాల, జూన్ 17 : ఉపాధి కోసం బహ్రెయిన్ దేశం వెళ్లిన పలువురు ఇంధనం దుర్వినియోగం కేసులో అరెస్టయ్యారు. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన బొమ్మిడి సుదర్శన్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ముగ్గురు, హైదరాబాద్‌కు చెందిన ఒకరితోపాటు మరో ముగ్గురు భారతీయులు బహ్రెయిన్‌లోని ఆల్ మోయ్యాద్ కంపెనీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
అయి తే ఇంధనం దుర్వినియోగం కేసులో ఈనెల 4న అక్కడి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. విషయం తెలుసుకున్న బొమ్మిడి సుదర్శన్ కొడుకు నితిన్ మంగళవారం ప్రజాభవన్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. తర్వాత ఎన్నారై అడ్వయిజరీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని కలిసి తన తండ్రితోపాటు మిగతా వారిని జైలు నుంచి విడిపించాలని కోరాడు.