
గద్వాల, అక్టోబర్ 5: ఏటా అశ్వయుజ మాసంలో ప్రారంభమయ్యే తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తెలంగాణలోని గద్వాల చేనేత పరిశ్రమ నుంచి ఏరువాడ జోడు పంచెలు వెళ్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల వెంకన్నకు ఇక్కడ మగ్గంపై నేసిన జోడు పంచెలను అలంకరిస్తారు. ఆ తరువాతే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 11 గజాల పొడవు, 85 ఇంచుల వెడల్పు, ఇరువైపులా 12 ఇంచుల బార్డర్‌తో కంచుకోట కొమ్మ నగిశీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీ ప్రత్యేకత. ఈ పంచెలను తయారు చేసేందుకు 41 రోజులు సమయం పడుతుంది. కార్మికులు నియమనిష్టలతో నేస్తారు. ఈనెల 7న తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు శ్రీవారికి పంచెలను అలంకరించేందుకు సిద్ధం చేసిన జోడు పంచెలను వాటి తయారీదారుడు మహంకాళి కరుణాకర్ గత నెల 30న తిరుమలలో ప్రధాన అర్చకుడికి అందజేశారు. ఏటా ఇక్కడి పంచెలు స్వామివారికి అందజేయడం ఆచారంగా వస్తున్నది.