తొర్రూరు, ఆగస్టు 30 : ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి రైతులకు మేలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వ్యవసాయ మారెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన ఆయిల్ పామ్ గెలలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మా ట్లాడుతూ.. మండలంలోని గోపాలగిరిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత రైతులకు వరంగా మారుతుందని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ప్రభుత్వం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకు మంజూరు లభించిందని, అందు లో సిద్దిపేటతోపాటు గోపాలగిరి ఉన్నట్టు తెలిపారు. తొర్రూరుకు మంజూరైన ఫ్యాక్టరీకి సుమారు రూ.100 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ శంకుస్థాపనకే పరిమితమైందని ఆరోపించారు. ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఆయిల్ పామ్ గెలలను దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేకుండా రైతులకు స్థానికంగానే మారెటింగ్ సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు.
అధికారుల సూచనల ప్రకారం సాగు చేస్తే ఎకరాకు సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు తమ పంటను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోపాలగిరిలో ఫ్యాక్టరీ నిర్మాణానికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి తొర్రూరు పరిసర ప్రాంతాల ఆయిల్ పామ్ రైతులకు మారెటింగ్ సమస్యను శాశ్వతంగా పరిషరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేకం అమలుకు నోచుకోవడంలేదని విమర్శించారు.