హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశించినట్టు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు ఖండించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని తాము ఎక్కడా చెప్పలేదని, ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే మీటర్లు పెట్టాలని చెప్పామని తెలిపారు. దీన్ని వక్రీకరించడం, మోటర్లకు మీటర్లు పెట్టాలని ఈఆర్సీ ఆదేశించినట్టు ఆరోపించడం సరికాదని హితవు పలికారు. సోమవారం ఆయన ఈఆర్సీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత నెలలో టారిఫ్‌ల సవరణ సందర్భంగా విద్యుత్తు సంస్థలకు కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేశామని, వాటిని సరిగా అర్థం చేసుకోలేకనే రఘునందన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. విద్యుత్తు సంస్థలకు జారీ చేసిన మార్గదర్శకాల కాపీని రఘునందన్‌కు పంపిస్తామని పేర్కొంటూ.. ఆ కాపీని పూర్తిగా చదివిన తర్వాతే ఈఆర్సీ గురించి మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని తెలిపారు. ఈఆర్సీ బృందం మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించి విద్యుత్తు సరఫరా సమస్యల గురించి తెలుసుకొంటుందని శ్రీరంగారావు వెల్లడించారు.