Equality For Telangana | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. Statue Of Equality విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీని Equality For Telangana అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు, తెలంగాణ యువకులు ప్రశ్నించారు. దీంతో Equality For Telangana అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో తెలంగాణపైన కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్విట్లలో ఎండగట్టారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలకు అందని సహాయం, పునర్ విభజన చట్టం హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అనేక అంశాల పైన తమదైన శైలిలో ప్రశ్నించారు.
పలువురు రాష్ట్ర మంత్రులు సైతం ప్రధాని పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు.
కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైన మా ప్రభుత్వంతోపాటు మంత్రులు, కేంద్రానికి పంపిన లేఖలపైన ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం పైన చూపిస్తున్న వివక్ష పైన మంత్రి నిరంజన్ రెడ్డి లేవనెత్తారు. తెలంగాణలో ఘనంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.
తనదైన శైలిలో అద్భుతమైన వివిధ కార్యక్రమాలతో పురోగమిస్తున్న తెలంగాణ లాంటి అభివృద్ధి కాముక రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఆపుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణపైన కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టేలా పలువురు యువకులు తమదైన శైలిలో ట్యాంకుబండ్ వేదికగా వివిధ అంశాలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు Equality For Telangana హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయి.