హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ) : రోడ్లను మెరుగుపర్చేందుకు హ్యామ్(హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) తప్ప మరొకటి లేదన్నట్టు ఏడాది కాలంగా ఊదరగొడుతూ కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా గా మరోసారి సమీక్ష నిర్వహించింది. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అధికారులతో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రివ్యూ చేశారు. హ్యామ్ ప్రాజెక్టు ద్వారా వచ్చే మూడేళ్లలో ఆర్అండ్బీ రోడ్లను అద్దంలా మెరిపిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. మొదటి దశలో రూ.10,986 కోట్లతో 5,587 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టిపెట్టామని, దశలవారీగా హ్యామ్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు చెప్పారు. మొదటి దశలోనే సింగిల్ లేన్, డబుల్ లేన్, ఫోర్‌లేన్ల వారీగా రోడ్లను అభివృద్ధితో పాటు విస్తరణ పనులు కూడా చేపడతామని తెలిపారు. మొదటి ఫేజ్‌కు ఒకటి, రెండు నెలల్లో టెండర్లు పిలువనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల వివరాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. హ్యామ్ రోడ్ల ప్రతిపాదనలపై ఆర్అండ్బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దశలవారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ట్రాఫిక్ సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని భట్టి కోరారు.
ప్రభుత్వం గతేడాది మొదట్లోనే రోడ్లను హ్యామ్‌లో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా సర్వే పేరుతో ఏడాది కాలం వృథా చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతామని మార్చిలో ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టులో అని చెప్పారు. ఈ మధ్యలో అనేక సార్లు కాంట్రాక్టర్లు, బ్యాంకర్లతో సమావేశాలు, సమీక్షలతో కాలయాపన చేశారు. అ యితే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విధంగా రోడ్లను అభివృద్ధి చేయడం సాధ్యంకాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో ప్లాన్ మా ర్చారు. తాజాగా కాంట్రాక్టర్లు ప్రతిపాదించిన విధంగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు కూడా హ్యామ్ రోడ్లపై ఒకటీరెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని మరోసారి ప్రకటించారు. ఏడాదిన్నర నుంచి బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే ధర్నాకు దిగారు. ప్రభుత్వం మాత్రం హ్యామ్ మొదటి దశలో రూ.10వేల కోట్లతో 5వేల కి.మీ.ల రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పడం గమనార్హం. కాగా, ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకే హ్యామ్ను తెరపైకి తెచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.