Engineering Seats | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు భారీగా తగ్గాయి. కన్వీనర్ కోటాలో 11 వేలకుపైగా సీట్లకు కోతపడింది. ఈ సీట్లు ఏమయ్యాయి? ఉన్నట్టా? లేనట్టా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సందిగ్ధత కొనసాగుతుండగానే, ఆయా సీట్లను మినహాయించి శుక్రవారం ఎప్సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించనున్నారు. నిరుడు ఎప్సెట్లో కన్వీనర్ కోటాలో 83,766 సీట్లు భర్తీచేశారు. ఈ ఏడాది వీటి సంఖ్య 72,741కి పడిపోయింది. కన్వీనర్, మేనేజ్మెంట్ నిరుడు 1.10 లక్షల సీట్లు ఉంటే, ఈ ఏడాది 1.01 లక్షల సీట్లకే పరిమితమయ్యాయి. ఇవి ఇప్పట్లో అందుబాటులోకి వస్తాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
11 వేల సీట్ల విషయం పెండింగ్లో ఉండగానే తాజాగా సర్కారు కొత్తగా ఐదు కాలేజీల్లోని కొత్త కోర్సుల్లో 3,365 సీట్లకు అనుమతినిచ్చింది. సీవీఆర్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ), ఐటీ కోర్సులు, స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్, తీగల కృష్ణారెడ్డి కాలేజీలో సీఎస్ఈ(ఏఐఎంఎల్), సీఎస్ఈ డాటా సైన్స్ కోర్సులకు అనుమతినిచ్చింది. వీటితో సీట్ల సంఖ్య 1,01,661కి చేరగా, ఇందులో కన్వీనర్ కోటా 72,741 ఉన్నాయి. సీట్ల తగ్గింపు విషయమై అధికారులను ఆరా తీయగా సీట్ల కన్వర్షన్ కోసం సర్కారు అనుమతి కోరినట్టు తెలిపారు.
కన్వీనర్ కోటా సీట్ల వివరాలు