హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను ఈ విద్యాసంవత్సరం మొత్తం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లెక్చరర్లు శుక్రవారం నాంపల్లిలోని ఇంటర్ విద్యా కమిషనరేట్‌ను ముట్టడించారు. రూ. 42వేల వేతనాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన లెక్చరర్లు కమిషనరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 దాటినా.. గెస్ట్ లెక్చరర్లను కొనసాగించకపోవడం అత్యంత దారుణమని వాపోయారు. 18 జూనియర్ కాలేజీలు కొత్తవి ఇవ్వగా, వాటిలో లెక్చరర్లు లేక చదువులు ముందుకు సాగడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.42వేల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎండీ భాషా, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, సదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.