హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సంవత్సరం నుంచి స్తబ్ధుగా ఉన్న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో కదలిక వచ్చింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌ను పరిషత్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించడంతోపాటు ఆమెకు చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. బీఆర్ఎస్ సర్కారు 2017లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేయడంతోపాటు పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక అవన్నీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వైస్ చైర్పర్సన్ నియామకంతో పరిషత్ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉన్నదని బ్రాహ్మణ సంఘాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. ఈ సందర్భంగా బ్రా హ్మణ పరిషత్ మాజీ చైర్మన్ రమణాచారి మాట్లాడుతూ.. ఆలస్యంగానైనా నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో గత ఏడాది బెస్ట్, విదేశీ విద్యా పథకాలకు ఎంపికైన వారికి లబ్ధి చేకూరుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.