హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ 19 నుంచి నిరవధిక బంద్‌ను పాటిస్తున్న తెలంగాణ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం కాస్త వెనక్కి తగ్గింది. పరీక్షల నిర్వహణకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి తెలిపారు. డిసెంబర్ 10లోపు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టమైన హామీ ఇవ్వడంతో పరీక్షలకు సహరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మంగళవారం నుంచి పాలమూరు, తెలంగాణ, శాతావాహన వర్సిటీల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. సాంకేతిక సమస్యలతో కేయూ పరిధిలో మాత్రం మూడు రోజులపాటు పరీక్షలను వాయిదావేశారు.
హైదరాబాద్, నవంబర్25 (నమస్తే తెలంగాణ): హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల నేపథ్యంలో గురుకులాల్లో క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిలిచిపోయిందని, త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ట్రిబ్ చైర్మన్ సైదులు వెల్లడించారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు. 1ః2 జాబితాలోని క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టుల అభ్యర్థులకు 27 నుంచి 29 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేవలం క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను మాత్రమే నిలిపివేశామని, షెడ్యుల్ ప్రకారం మ్యూజిక్ టీచర్ పోస్టుల సర్టిఫికెషన్ వెరిఫికెషన్ యథావిధిగా కొనసాగుతుందని ట్రిబ్ చైర్మన్ సైదులు స్పష్టంచేశారు. 27 నుంచి 29 వరకు మ్యూజిక్ టీచర్ల అభ్యర్థులు మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. https://treirb.cgg.gov.in లో షెడ్యూల్ చూసుకోవచ్చని పేర్కొన్నారు.