హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌లో సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలిన ఘటనపై ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ సీరియస్ అయ్యారు. కెనాల్ నిర్మాణాలు, నిర్మాణ పటిష్టత తదితర వివరాలతో 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌లోని ప్యాకేజీ-4లో భాగంగా సీతారామ కెనాల్ 48.309 కిలోమీటర్ వద్ద నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్-1 ఇటీవల క్రితం కూలింది. దీనిపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలోనే నష్టం జరిగిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని ఎందుకు తీసుకురాలేదని కొత్తగూడెం సీఈకి ఈఎన్సీ జనరల్ మంగళవారం నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందిన మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులనూ ఆయన ఆదేశించారు.