Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 19 : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం, రాజరాజేశ్వరాలయం మధ్య ఆస్తిపన్ను విషయంలో రగడ నడుస్తున్నది. వేములవాడ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది రాజన్న ఆలయం నుంచి రూ.16 లక్షల గ్రాంట్ ఇచ్చేవారు. 2011లో మున్సిపాలిటీగా మారిన తర్వాత రాజన్న ఆలయ అనుబంధంగా ఉన్న వసతి గదుల సముదాయాలు, అద్దె దుకాణాలపై ఆస్తిపన్ను చెల్లించాలని అప్పటి పురపాలక శాఖ ఆదేశించింది. దీంతో 2020-21లో ఆలయానికి సంబంధించిన నందీశ్వర, లక్ష్మీగణపతి, పార్వతీపురం, శంకరపురం, రాజేశ్వరపురం, ధర్మశాలలతోపాటు స్వామివారికి అనుబంధంగా ఉన్న వాణిజ్య దుకాణాలకు సంబంధించి మున్సిపల్ అధికారులు అసెస్మెంట్ చేశారు. ఇక ప్రతి ఏడాది రూ.1.9 కోట్ల ఆస్తి పన్ను చెల్లించేలా లెకలు వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా 2014 నుంచి 2020 వరకు రూ.6 కోట్లు బకాయిలుగా చూపుతూ 2020-21లో రాజన్న ఆలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. అయితే, ప్రస్తుత పన్ను బకాయి మాత్రమే చెల్లిస్తామని, గత నాలుగేండ్లుగా ప్రతి ఏడాది రూ.1.9 కోట్ల ఆస్తి పన్ను చెల్లిస్తూ వచ్చారు.
అసలు రూ.6 కోట్లు.. వడ్డీ రూ.7.5 కోట్లు..
వేములవాడ పురపాలక సంఘ కార్యాలయం నుంచి ఆస్తిపన్ను బకాయిలు రూ.13.50 కోట్లు చెల్లించాలని ఇటీవల రాజన్న ఆలయానికి నోటీసులు జారీ చేశారు. అయితే, 2014 నుంచి 2020 వరకు ఆరేండ్ల బకాయిని రూ.6 కోట్లుగా చూపుతూ దానికి వడ్డీగా రూ.7.50 కోట్లు కలిపి మొత్తం రూ.13.50 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నది. 2020-21లో ఆలయ ఆస్తులను లెకించి పన్ను వేసిన మున్సిపల్ అధికారులు 2014 నుంచి బాకీ చూపడాన్ని ఆలయ అధికారులు తప్పుపడుతున్నారు. నాలుగేండ్లపాటు అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకమొత్తంలో బకాయి చెల్లించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేరొంటున్నారు. అసలు కంటే వడ్డీ ఎకువగా ఉండడాన్ని తమ శాఖ ఎలా పరిగణలోకి తీసుకుంటుందని, పైగా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం చెల్లించరాదనే వాదన వినిపిస్తున్నారు.
బాకీదారులందరికీ నోటీసులిచ్చాం
అస్తిపన్ను బకాయిలు వసూలు చేసే క్రమంలో బాకీదారులందరకీ నోటీసులు ఇచ్చాం. ఇందులో భాగంగానే రాజన్న ఆలయ అధికారులకూ ఇచ్చాం. రూ.13.5 కోట్ల బకాయి ఉన్నది. ఏడాది కరెంట్ పన్ను బకాయి మాత్రమే చెల్లిస్తున్నారు. పాత బకాయి వడ్డీతో సహా రూ.13.5 కోట్లకు చేరినందున మొత్తం చెల్లించాలని నోటీసులిచ్చాం.
-అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ
దేవాదాయ కమిషనర్‌కు లేఖ రాశాం
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి కోసం ఇటీవల లేఖ రాశాం. రూ.13.5 కోట్ల బకాయి చెల్లించే అంశం కమిషనర్ పరిధిలోనే ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం.
– వినోద్‌రెడ్డి, ఈవో, రాజన్న ఆలయం