హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఎంసెట్‌లో సత్తాచాటేందుకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఏప్రిల్, మే మాసాల్లో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్ ఇవ్వనున్నారు. జిల్లాకొక కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసి విద్యార్థులకు తర్ఫీదు ఇస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇంటర్ విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ సోమవారం విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఈ శిక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు. పరీక్షలకు ముందు రెగ్యులర్ సిలబస్‌తో సమాంతరంగా ఎంసెట్ శిక్షణ ఇస్తారు. పరీక్షలు ముగిశాక జిల్లాకు 100 మంది విద్యార్థుల చొప్పున రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని 33 జిల్లాల్లో శిక్షణకేంద్రాలు ఏర్పాటుకానుండగా, 3,300 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పర్యవేక్షణకు అధ్యాపకురాలు జ్యోత్స్నరాణిని కో ఆర్డినేటర్‌గా నియమించారు.