హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పేరెత్తితేనే ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీని తలచుకుంటేనే వారి గుండెలు రగిలిపోతున్నాయి. ఎందుకంటే ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ఉద్యోగులపై సీపీఎస్‌ను రుద్దిన రోజుకావడం. ఉద్యోగులకు భద్రతను దూరం చేసి రోడ్డుమీద పడేసిన దినం. ఈ దుర్దినాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 1ని రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ‘పెన్షన్ విద్రోహక దినం’గా జరుపుకొంటున్నాయి.
మ్యానిఫెస్టో హామీ మేరకు సీపీఎస్ భూతం నుంచి విముక్తి కల్పించి పాత పింఛన్ అమలుచేయాలని సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నాయి. ఈ క్రమంలో పాత పింఛన్ అమలుచేయాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ విద్రోహక దినం పాటించి నిరసనలు తెలుపాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపాలని సూచించింది. మధ్యాహ్నం 1 గంటకు అబిడ్స్‌లోని బీమాభవన్, మధ్యాహ్నం 1:30 గంటలకు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో నిరసనలు తెలుపనున్నట్టు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ వెల్లడించారు.
రాష్ట్రంలో ఉద్యోగులకున్న పింఛన్ హక్కును హరించింది కాంగ్రెస్ పార్టీయే. దీనికి పూర్తిబాధ్యత ఆ పార్టీ ప్రభుత్వానిదే. 2004లో అప్పటి వైఎస్ సర్కార్ సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి సీపీఎస్‌ను వర్తింపజేస్తూ జీవో-653 జారీచేసింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ రోడ్డున పడేంది. ఈ పాపానికి ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీయే ప్రస్తుతం అధికారంలో ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దుచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక విస్మరించింది. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న హామీతోనే కాంగ్రెస్ నాలుగు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లో సీపీఎస్‌ను రద్దుచేశారు.
కానీ, తెలంగాణలో రద్దు చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. పైగా 2003లో నోటిఫికేషన్లు విడుదలై, ఆ తర్వాత నియమితులైన ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వమే సీపీఎస్‌ను అమలుచేసింది. దీంతో టీచర్లు, పోలీసులు, హెల్త్ ఉద్యోగులు బలవంతంగా సీపీఎస్‌లోకి నెట్టబడ్డారు. వీరికి పాత పింఛన్ అమలుచేయాలని ఇటీవలే హైకోర్టు తీర్పునిచ్చినా సర్కార్ ఖాతరు చేయడం లేదు. సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకూ ఈహెచ్ఎస్ స్కీమ్‌ను వర్తింపజేయడం లేదు. దీంతో సీపీఎస్ ఉద్యోగులు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.