Current Bill | చెన్నూర్ రూరల్, అక్టోబర్ 26: సాధారణ గృహ విద్యుత్తు వినియోగదారుడికి రూ.1,47,222 కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మొత్తాన్ని ఏకకాలంలోనే చెల్లించాలని విద్యుత్తు శాఖ అధికారులు తెలుపడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామంలో వెలుగుచూసింది. కొమ్మెరకు చెందిన గట్టు సంపత్‌గౌడ్ 2016లో గృహ విద్యుత్తు మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మీటర్ వచ్చినప్పటికీ నాలుగు నెలలైనా బిల్లు రాలేదు. గ్రామంలోని లైన్‌మన్‌ను అడిగితే.. ఇంకా మీటర్ ఆన్లైన్లో నమోదు కాలేదని తెలిపాడు. అప్పటి నుంచి ఈ సమస్యపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు.
ఈ ఏడాది జూన్‌లో తనిఖీలకు వచ్చిన విజిలెన్స్ అధికారులకు, చెన్నూర్ ఏడీఈకి ఫిర్యాదు చేయడంతో మీటర్ నంబర్ వచ్చింది. జూలైలో బిల్లు తీయగా.. రూ.1,47,222 రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. సమస్య పరిష్కరించాలని మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. బిల్లు కట్టాల్సిందేని అధికారులు చెప్పడంతో చెన్నూర్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట గ్రామస్థులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపాడు. ఈ విషయంపై కొమ్మెర ఏఈ శ్రీనివాస్ స్పందించి బాధితుడు డీడీ తీసి ఇస్తే మీటర్‌ను చెకింగ్ కోసం పంపుతామని తెలిపారు.