ములుగు, మే 29 (నమస్తేతెలంగాణ): గ్రామాల్లో సర్పంచ్‌లుగా పదవీ కాలం పూర్తయ్యే వరకు చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, తాజా మాజీ సర్పంచ్ సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భూక్యా పాప పవన్‌నాయక్ అధ్యక్షతన చేపట్టిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లులు చెల్లించాలని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రాలు అందించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నందున ఇక్కడి నుంచే పోరాటం చేసేందుకు సమావేశమైనట్టు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అప్పటి సీఎం కేసీఆర్‌కు బిల్లుల విషయాన్ని తెలియనివ్వకుండా నిధులను పక్కదారి పట్టేలా చేశారని ఆరోపించారు. బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పూనుకుంటే గ్రామ స్థాయిలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డు, జీపీ భవనాలకు తాళాలు వేసి అక్కడే బైఠాయించి పోరాటాలు చేయా ల్సి వస్తుందని హెచ్చరించారు. అప్పులు చేసి గ్రామాభివృద్ధికి ముందుండి సర్పంచ్‌లుగా తమ గౌరవాన్ని గ్రామాల్లో నిలుపుకొన్నామని, ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన చెందారు.