హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు త్వర లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గురుకుల సొసైటీకీ చెందిన అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వద్ద బలంగా వినిపించడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు గురుకుల సంఘాల నేతలు చెప్తున్నారు. గురుకుల టీచర్లు సైతం ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండ టం కూడా వారిని ఆ దిశగా ప్రేరేపిస్తున్నది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్నాయి. ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 25 వేల వరకు ఓట్లు ఉండగా, అందులో గురుకులాల టీచర్లవే ఆరు వేలకుపైగా ఉన్నాయి.
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 28 వేలకుపైగా ఉపాధ్యాయులు ఉండగా, అందులో గురుకులాల నుంచే ఎనిమిది వేలకుపైగా ఉన్నారు. వీటితోపాటు కేజీబీవీలు సైతం ఆయా జిల్లాల పరిధిలో భారీగా ఉన్నాయి. కొత్తగా గురుకులాల్లో నియామకాలు జరిగిన నేపథ్యంలో ఆ మేరకు ఓట్ల సంఖ్య కూడా పెరగనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదా పు 4-5 నెలల క్రితం నుంచే గురుకుల సొసైటీకి చెందిన యూనియన్లు కసరత్తు చేస్తున్నా యి. టీచర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచే ఆశావహుల్లో ప్రధానంగా టిగారియా యూనియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్ పేరు వినిపిస్తున్నది. హత్నూర్ సీవోఈలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ పొందాల్సి ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచేందుకు వీఆర్ఎస్ పెట్టుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతున్నది. ప్రధానంగా కరీంనగర్-మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మె ల్సీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ట్టు యూనియన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గు రుకుల సొసైటీలకు సంబంధించిన మరో రెం డు యూనియన్లకు చెందిన నేతలు కూడా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ప్రణాళికలు రూ పొందించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
‘ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురుకుల అభ్యర్థిని గెలిపించుకుంటాం’ అనే నినాదంతో గురుకుల సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రతినిధి వర్గం బుధవారం ప్రత్యేకంగా టిగారియా కార్యాలయంలో సమావేశమైంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురుకుల ఉపాధ్యాయుడిని అభ్యర్థిగా బరిలో నిలపాలని తీర్మానించింది. గురుకుల సమస్యల పరిషారానికి చొరవ చూపించిన నాయకులెవరైనా సరే ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు ముందుకు వస్తే, వారిని గెలిపించుకోవడానికి గురుకుల సంఘాలు పనిచేయాలని తీర్మానించారు. ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీ చైర్మన్‌గా టీఎస్డబ్ల్యూఆర్ఈటీఏ ఫౌండర్ ప్రెసిడెంట్ నరేందర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. గురుకుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి మొదటి ప్రాధాన్య ఓటుతోటే గెలిపించాలని జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్, అంజయ్య పిలుపునిచ్చారు.
ప్రత్యేక గుర్తింపు కోసమే
గురుకుల టీచర్ల సమస్యలను ఎజెండా మీదకు తేవడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నట్టు పలు గురుకుల సంఘాల నేతలు చెప్తున్నారు. విద్యాశాఖ పరిధిలోని టీచర్లకు దక్కే ప్రాధాన్యం, అవకాశాలు, వెసులుబాట్లు తమకు లభించడం లేదన్న ఆవేదన గురుకుల ఉపాధ్యాయుల్లో ఉన్నది. గురుకులాల్లో పనివేళలు గతంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండగా, ఇటీవల ప్రభుత్వం దానిని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు పొడిగించింది. వీరికి బోధనేతర బాధ్యతలు కూడా అధికమే. దీనికితోడు నైట్ స్టే విధులు కూడా ఉంటాయి. విద్యాశాఖలోని టీచర్లకు వర్తిస్తున్న సర్వీస్‌రూల్స్ గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వర్తించడం లేదు. ఆఖరికి వేతనాలు కూడా 010 పద్దు ద్వారా కాకుండా సొసైటీ ద్వారా నెలలో ఏదో ఒక తేదీన చెల్లిస్తున్న దుస్థితి.