ధర్మసాగర్, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో మంగళవారం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ యాదగిరి ఏసీబీకి పట్టుబడ్డాడు. మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన రైతు మజ్జిగ లింగం తన రెండెకరాల వ్యవసాయ భూమిలో 820 మునగ మొక్కలను జూన్ నుంచి పెంచుతున్నారు. దీనికి ఉపాధి హామీ పథకంలో ఒక్కో మొక్కకు నెలకు రూ.5లు ఇవ్వాల్సి ఉన్నది. జూలై నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో టెక్నికల్ అసిస్టెంట్ యాదగిరిని సంప్రదించగా, రూ. పదివేలు లంచం డిమాండ్ చేశాడు. బాధిత రైతు ఏసీబీ అధికారులకు సమాచారమందించారు. ఒప్పందం ప్రకారం టీఏ యాదగిరి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.