హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయక స్థితిలో పాలక వర్గాలున్నాయని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఉద్యమాలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ అన్నారు. 10 నుంచి 30వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర సమితి సమావేశాన్ని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిషరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు దూరం చేసే కుట్రలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయాలని చూస్తుందని విమర్శించారు.
గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అల్లాడుతున్నారని, దీనికి కారణాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గ్యార నరేశ్, బానోత్ రఘురాం, గ్యార క్రాంతి, సీ రాజు, కాసోజ్ నాగజ్యోతి, దత్తు రెడ్డి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.