Model School Teachers | హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా.. పనిచేసేదేమో సూర్యాపేట. ఇదే సూర్యాపేట జిల్లాకు చెందిన మరో టీచర్‌కు సిద్దిపేట జిల్లా లో పోస్టింగ్. సిద్దిపేట జిల్లాకు చెందిన మరో టీచర్‌కు ఛత్తీస్‌గఢ్ బార్డర్లో పోస్టింగ్. ఇలా తమ స్వస్థలాలకు 150-200 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న మాడల్ స్కూల్ టీచర్ల కు మోక్షం కలిగింది. పాఠశాల విద్యాశాఖ శనివారం 2,757 మంది మాడల్ స్కూల్ టీచర్లకు స్థానచలనం కల్పించింది. పదకొండేండ్ల నరకయాతన నుంచి విముక్తి కల్పించింది. ఉపాధ్యాయ సంఘాలు, టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, పీఎంటీఏటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
గత కాంగ్రెస్ సర్కారు నిర్వాకం..
194 మాడల్ స్కూళ్లల్లో 5,500 మంది రెగ్యులర్ టీచర్లు పనిచేస్తున్నారు. 2011లో నోటిఫికేషన్ ఇచ్చినా.. 2013-14వరకు దశలవారీగా టీచర్లను రిక్రూట్చేశారు. దీంతో కాంగ్రెస్ సర్కారు హయాంలో రోస్టర్ కమ్ మె రిట్ పాటించలేదు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు ఒక్కో స్కూల్‌కు 2 పోస్టులను భర్తీచేయాల్సి ఉండగా, ఒక పోస్టునే నింపారు. ఒకే స్కూల్లో రెండు పోస్టులకు ఎంపికైన వారిని పోస్టుల్లేవని దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. దీంతో చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టుగా పరిస్థితి మారింది.
కష్టాలను దూరం చేసిన కేసీఆర్
మాడల్ స్కూల్ టీచర్ల కష్టాలను గత కేసీఆర్ సర్కారు దూరం చేసింది. వీరికి రాష్ట్ర విభజనకు ముందే ఉద్యోగాలిచ్చినా గత కాంగ్రెస్ సర్కారు సర్వీస్ రూల్స్‌ను రూపొందించలేదు. 2019లో కేసీఆర్ సర్కారు సర్వీస్ రూల్స్‌ను రూపొందించి, ప్రభుత్వ ఉద్యోగుల్లా సెలవులు వాడుకునేందుకు లీవురూల్స్ను అమలు చే సింది. డీఏ, పీఆర్సీని అమలుచేసింది. జీవో -317 అమలుచేసేందుకు సంకల్పించింది. దీనిపై కోర్టుకెళ్లడంతో పాత జోన్ల ప్రకారం బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. గతేడాది జూలైలో బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేసిం ది. పలువురు టీచర్లు సీనియార్టీ, సర్వీస్ పా యింట్ల మీద కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 12న బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో శనివారం తెల్లవారుజామున టీచర్లను ప్రభుత్వం బదిలీచేసింది.