Teacher Promotions | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): వారంతా గ్రేడ్ -2 భాషాపండితులు. తాజా పదోన్నతుల్లో ప్రమోషన్ వస్తుందని కలలు కన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కూడా హాజరయ్యారు. ఏకంగా పదోన్నతులు పొందిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ కావాలో తెలిపేందుకు వెబ్ ఆప్షన్లు సైతం ఇచ్చారు. కానీ ఏం జరిగిందో తెలియదు.. తీరా చూస్తే వారికి పదోన్నతి దక్కలేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో ఆరు వందల మందికిపైగా ఉంటారని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. అధికారుల తీరుతో అందివచ్చిన పదోన్నతి ఆఖరు నిమిషంలో చేజారడంతో వారు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. పీఈటీలకు సైతం ఇదే తీరులో నష్టం జరిగిందని వాపోతున్నారు. టీచర్ల పదోన్నతుల్లో భాగంగా రేవంత్‌రెడ్డి సర్కారు పలువురు గ్రేడ్ -2 భాషాపండితులకు మొండిచెయ్యి చూపింది. రోస్టర్ విధానాన్ని పాటించడంతో ఏకంగా 600 మంది భాషాపండితులు ప్రమోషన్‌కు దూరమయ్యారు.
టీచర్ల పదోన్నతుల్లో భాగంగా గ్రేడ్ -2 భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించారు. మల్టీజోన్ -1లో బుధవారం పదోన్నతుల ఉత్వర్వులిచ్చారు. మల్టీజోన్ -2లో శుక్రవారం రాత్రికి లేదా.. శనివారం పదోన్నతుల ఉత్తర్వులు విడుదలకానున్నాయి. అయితే రోస్టర్ విధానం పేరుతో కొంత మందికి పదోన్నతులిచ్చి, మరికొంత మందిని విద్యాశాఖ పక్కనపెట్టినట్టు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది అన్యాయమని, ఏన్నో ఏండ్లుగా పదోన్నతులు కోసం వేచిచూస్తున్న వారిని రోస్టర్ విధానం పేరుతో పక్కనపెట్టడం సరికాదంటున్నాయి. పోస్టులున్నా నింపకపోవడమేంటని ప్రశ్నిస్తున్నాయి. బ్యాక్‌లాగ్‌లో పెట్టడం వల్ల ఉపయోగమేంటని మండిపడుతున్నాయి. దీంతో అప్‌గ్రేడ్ అయిన పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక బోధన కుంటుపడుతుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే విషయంపై ‘నమస్తే తెలంగాణ’ విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.