హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో సీట్ల భర్తీకి నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అడ్మిషన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి, వైస్చైర్మన్లు ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, అడ్మిషన్స్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా 21 నుంచి 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 23 నుంచి 26వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 2న అర్హుల జాబితా విడుదల చేస్తారు. 4,5న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 6న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ ఉంటుంది.
9న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 11 నుంచి 14 వరకు సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 18 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాల కోసం http://edcetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. కాగా బీపీఈడీ, డీపీఈడీ వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నది. 14న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, 23 నుంచి 29 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 25, 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 30న అర్హుల జాబితా విడుదల చేస్తారు. 31, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 2న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ ఉంటుంది. 4న సీట్లు కేటాయిస్తారు. 5 నుంచి 8 వరకు సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 11 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. వివరాల కోసం http://pecetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.