హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రీ లాంచ్ పేరుతో చేసిన దందా కేసులో జనప్రియ వెంచర్స్‌కు చెందిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌లో ఈడీ అధికారులు రెండ్రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. రూ.60 కోట్ల మోసానికి సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లోని 8 చోట్ల సోదాలు చేపట్టి డిజిటల్ పరికరాలతో పాటు పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామన్నారు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ ఎండీ కాకర్ల శ్రీనివాస్‌తోపాటు పలువురు వ్యక్తులు, సంస్థ లు ప్రీ లాంచ్ పేరుతో వినియోగదారుల నుంచి రూ.60 కోట్లు వసూలు చేసి, ఫ్లాట్లు ఇవ్వకపోగా డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులు రావడంతో కేసు నమోదైంది.
ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. ఫ్లాట్లు విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని జయత్రి కంపెనీ పలు షెల్ కంపెనీల ద్వారా డైవర్ట్ చేసినట్టు పేర్కొన్నారు. జనప్రియ గ్రూప్, రాజా డెవలపర్స్ అండ్ బిల్డర్స్, ఆర్కే రమేశ్, సత్యసాయి ట్రాన్స్పోర్ట్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్స్ వంటి సంస్థల్లో సోదాలు చేపట్టినట్టు వెల్లడించారు. దొరికిన ఆధారాల్లో ఇంకా డెలివరీ చేయని ఫ్లాట్ల రికార్డులు, ఎంవోయూలు, ప్రాజెక్టు భూములను మూడో వ్యక్తులకు అప్పగించిన డాక్యుమెంట్లు, నేర ఆదాయం ఎకడ పెట్టుబడి పెట్టారనే వివరాలు ఉన్నట్టు తెలిపారు.