హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): సరోగసీ ఆరోపణలపై డాక్టర్ పచ్చిపాల నమ్రత అలియాస్ అతలూరి నమ్రతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం చట్టబద్ధమేనని హైకోర్టు తీర్పుచెప్పింది. తన అరెస్టును రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ నమ్రత దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తుది ఉత్తర్వులు వెలువరించింది. బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా హైకోర్టుకు రావడాన్ని తప్పుపట్టింది. సరోగసీ అక్రమాలు, పిల్లల అక్రమ రవాణా అభియోగాలపై నమోదైన కేసులో ఫిబ్రవరి 12న డాక్టర్ నమ్రతను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ అక్రమమని, కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నమ్రత దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పింది.