ED | హెచ్ఎండీఏ పూర్వ ప్రణాళికాధికారి శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్‌తో పాటు చైతన్యనగర్ ప్రాంతాల్లోని శివ బాలకృష్ణ, అతని సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో దాడులు చేసిన ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. శివ బాలకృష్ణకు రూ.250 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గతంలో ఏసీబీ దాడుల్లో గుర్తించింది. 200 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలాలు, విల్లా తదితర ఆస్తులు గుర్తించిన ఏసీబీ వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లుంటుందని అంచనా వేసింది.
ఇప్పటికే శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్అవినీతి నిరోధకశాఖ అరెస్టు చేసింది. తాజాగా ఈడీ నిర్వహించిన దాడుల్లో శివ బాలకృష్ణ, నవీన్ కుమార్ నివాసాల్లో పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ అడ్డదారుల్లో సంపాదించిన ఆస్తులకు బినామీలుగా వ్యవహరించిన ఆయన సమీప బంధువులైన ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా శివబాలకృష్ణ అతడి సోదరుడి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనే శివబాలకృష్ణ, శివనవీన్ అరెస్టయ్యారు. అయితే, ఇటీవల వారు కొద్ది రోజుల కిందట బెయిల్‌పై విడుదలయ్యారు.