హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్, సురానా కంపెనీల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ రూ.74.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు గురువారం ఈడీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మనీలాండరింగ్ యాక్ట్‌కు విరుద్ధంగా నగదు బదిలీలు జరిగాయనే సమాచారంతో సోదాలు చేసినట్టు తెలిపారు.
ఈ దాడుల్లో వివిధ నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. నరేంద్ర సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్టు గుర్తించామని వెల్లడించారు.
సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ అయిన సాయిసూర్య డెవలపర్స్‌కు చెందిన సతీశ్ ఇంట్లో భారీగా నగదు సీజ్ చేసినట్టు చెప్పారు. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో మోసం చేశాడనే ఆరోపణలతో కొన్నిరోజుల క్రితం సతీశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఆధారంగా సాయి డెవలపర్స్‌పై ఈడీ విచారణ జరిపింది. సోదాల్లో హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం ఈడీ చేసుకుంది.