హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలిపింది. మాజీ ఓఎస్డీ కల్యాణ్‌తోపాటు ఇతరుల ఇండ్లలో సోదాలు నిర్వహించి.. 200కు పైగా బ్యాంకు అకౌంట్లకు చెందిన పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నది. ఈడీ సోదాల్లో 31 సెల్ఫోన్లు, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో రూ.18 కోట్ల ఆస్తులు జప్తు
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ‘ఫాల్కన్’ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.18.14 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. వీటిలో హైదరాబాద్‌కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీ డైరెక్టర్ అమర్దీప్ (బీహార్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడు), అతని కుటుంబసభ్యులతోపాటు రెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, రెట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు సంబంధించిన 12 ఆస్తులు ఉన్నట్టు శుక్రవారం ప్రకటించింది. ‘ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్’ ద్వారా పెట్టుబడుల పేరుతో వందల మంది అమాయకులను రూ.792 కోట్లకు మోసగించినట్టు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమర్దీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.