హైదరాబాద్, నవంబర్13 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ ఏజెన్సీ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవో (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), జేపీ ఇన్ఫ్రా చైర్మన్, ఎండీ మనోజ్ గౌర్‌ను మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. జేపీ విష్ టౌన్, జేపీ గ్రీన్స్ ప్రాజెక్టు పేరిట జేపీ గ్రూప్ రూ.14,599 కోట్లు వసూలు చేసిందని, ఆ మొత్తాన్ని ఇండ్ల నిర్మాణం కోసం కాకుండా ఇతర కంపెనీలు, పెట్టుబడులకు మళ్లించిందని ఇండ్ల కొనుగోలుదారులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో కంపెనీపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా గృహనిర్మాణాల కోసం ప్రజల వద్ద తీసుకున్న దానిలో రూ.12,000 కోట్ల మేరకు నిధులను మనోజ్గౌర్ ఎండీగా కొనసాగుతున్న జేపీ సేవా సంస్థాన్, జేపీ హెల్త్‌కేర్, స్పోర్స్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలకు మళ్లించినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో గత మేలో జేపీ గ్రూప్ సంస్థలో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిధుల మళ్లింపులో కీలకపాత్ర మనోజ్గౌర్దేనని గుర్తించిన ఈడీ అధికారులు తాజాగా ఆయనను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనులను జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ 2005లో దక్కించుకున్నది. నిర్ణీత కాలంలో టన్నెల్ పనులను పూర్తి చేయకుండా అనేక సాకులు చూపుతూ వస్తున్నది. ఔట్లెట్ టన్నెల్ పనులను తుదకు ప్రారంభించినా రోజుల వ్యవధిలోనే టన్నెల్ కూలిపోయి 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా ఆరుగురి అచూకీ ఇంకా దొరకలేదు. మరోవైపు జేపీ ఏజెన్సీ నష్టాల్లో కూరుకుపోగా ఈ పనులను వేదాంత కంపెనీ రూ.12 వేల కోట్లకు టేకోవర్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.