హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బ్యాలట్ పేపర్ల ముద్రణ ప్రారంభమైందని, ఈ నెల 18 కల్లా పోస్టల్ బ్యాలట్, 20వ తేదీ కల్లా ఈవీఎంల బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తిచేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ సీఈవో సత్యవాణి తెలిపారు. చంచల్గూడలోని ప్రభుత్వ ముద్రణాలయంలో వీటిని ముద్రిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా మరో 299 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నామని తెలిపారు. బీఆర్కేఆర్ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో సత్యవాణి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు.
పెరిగిన ఓటర్లు, దూర ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వల్ల కొత్తగా 299 బూత్‌ల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని చెప్పారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలుంటాయని తెలిపారు. ఇంటి వద్ద ఓటింగ్ వేసే తేదీలను ఖరారు చేసే అధికారం ఆయా రిటర్నింగ్ అధికారులకే ఉంటుందని చెప్పారు. ఆ తేదీలను అభ్యర్థులకు, ఓటర్లకు తెలుపుతారని వివరించారు. ఇంటివద్ద ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారు పోలింగ్ బూత్‌లో ఓటు వేసే అవకాశం లేదని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమీకృత నియంత్రణ వ్యవస్థ-ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసింది. ఎన్నికల నేపథ్యంలో జరిగే హింస, దౌర్జన్యం, కుల, మత రాజకీయాలు, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, తప్పుడు సమాచారం, సైబర్ నేరాలు, విద్వేష ప్రసంగాలు, ప్రలోభాల వంటి సమస్యలపై ఈ కేంద్రం నుంచి దృష్టి సారించనున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని సరైన నిర్ణయాలతో స్పందించడానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కేంద్రం 24 గంటల పాటు నిరంతరం పనిచేస్తుంది.
తనిఖీలు, స్వాధీనాలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, 1950 కాల్ సెంటర్‌కు అందిన ఫిర్యాదులు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు, ప్రకటనలతో సహా ప్రచార, ప్రసారాల్లో జరిగే ఉల్లంఘనలు, నిఘా బృందాల సమన్వయం, సీ-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులు, సువిధ తదితర అంశాలను ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజు 15 శాటిలైట్ టివీలు, మూడు యూట్యూబ్ చానళ్లను పరిశీలించే ఏర్పాటు కూడా చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోని కంట్రోల్ రూంలను దీని పరిధిలోకి తెచ్చారు.