హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ప్రింట్ తీసిన ఆన్లైన్ దరఖాస్తుపై గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తుపై విద్యార్థి ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాల్సి ఉండగా, తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు. ఎంసెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు.
విద్యార్థులు రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులు మాస్క్ ధరించాల్సిందేనని తెలిపారు. విద్యార్థులు ఏదైనా గుర్తింపు కార్డు, హాల్‌టికెట్‌తోపాటు చిన్నసైజు వాటర్‌బాటిల్, శానిటైజర్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. సెషన్‌కు 29 వేల మంది చొప్పున మొత్తం ఆరు సెషన్స్‌లో 1.72 లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకుంటామని, మెహిందీ లాంటివి చేతికి పెట్టుకోవద్దని సూచించారు.