హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును ఈగల్ బృందాలు రట్టు చేశాయి. గురువారం జీడిమెట్ల సుచిత్ర క్రాస్‌రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయిదత్తా రెసిడెన్సీపై దాడి చేసి సుమారు రూ.72 కోట్ల విలువైన 220 కేజీల ఎఫెడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు డ్రగ్స్ తయారీదారులను అరెస్టు చేసి, వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు శివరామకృష్ణ స్వస్థలం కాకినాడ. అమలాపురంలో క్వాలిటీ కెమిస్ట్‌గా 2003 వరకు పనిచేశాడు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని మరో కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్‌గా చేరాడు. అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి, సొంతూరిలో ఆక్వా వ్యాపారం చేస్తున్నాడు. దాంతోపాటు డ్రగ్స్ సప్లయర్‌గా మారాడు. ఈ క్రమంలో 2017, 2019 బెంగళూరు ఎస్సీబీ, హైదరాబాద్ పోలీసులకు రెండుసార్లు పట్టుబడ్డాడు. 2024 డిసెంబర్లో తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ తయారీ ప్రారంభించాడు. తన కంపెనీ యజమానులకు భారీగా డబ్బులు ఆఫర్ చేసి.. అక్కడ ఎఫెడ్రిన్ తయారీకి ఒప్పించాడు. అప్పట్నుంచి రహస్యంగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. పాత నేరస్తులపై నిఘాలో భాగంగా వీరి గురించి ఈగల్ టీమ్ ఆరా తీయగా ఈ వ్యవహారం బయటపడిందని పోలీసులు చెప్తున్నారు. పట్టుపబడిన ఎఫెడ్రిన్‌ను మరో డ్రగ్‌గా తయారు చేస్తారని, అప్పుడు దాని విలువ 10 రెట్లు పెరుగుతుందని ఈగల్ టీమ్ దర్యాప్తులో గుర్తించింది.
తెలంగాణలో మత్తు మాఫియా రెచ్చిపోతున్నది. గ్రాములు, కేజీల చొప్పున కాదు.. ఏకంగా క్వింటాళ్ల కొద్దీ డ్రగ్స్ పట్టుబడుతుండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్ అడ్డాగా సాగుతున్న డ్రగ్స్ మాఫియాపై నిఘా పెట్టిన ముంబై పోలీసులు రూ.12వేల కోట్ల భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ముంబై పోలీసులు వచ్చి అక్రమార్కులను పట్టుకునే వరకు రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆలస్యంగా మేల్కొన్న తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బృందాలు రంగంలోకి దిగాయి. వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు.