హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బోయినపల్లి శ్రీమేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్‌గౌడ్ పదినెలలుగా అల్ఫ్రాజోలమ్ డ్రగ్ తయారుచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జయప్రకాశ్ తన బైక్ మీదనే డ్రగ్ సరఫరా చేసేవాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. కేసులో జయప్రకాశ్గౌడ్తోపాటు శేఖర్, మరో నిందితుడు గురవారెడ్డి పాత్రపైనా ఈగల్‌టీమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. గురవారెడ్డి అందించిన ఫార్ములాతోనే జయప్రకాశ్‌గౌడ్ స్కూల్లో డ్రగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డ్రగ్స్ కేసులో నిందితుడు జయప్రకాశ్‌గౌడ్ నడుపుతున్న పాఠశాలలోని రెండు గదుల్లో అల్ఫ్రాజోలం తయారు చేసేవాడని, పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడని పోలీసులు గుర్తించారు.
డ్రగ్ తయారీ విషయం పాఠశాల సిబ్బందికి తెలియకుండా స్కూల్‌తో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్‌సాయి సహకారం తీసుకున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, సంగారెడ్డికి కూడా జయప్రకాశ్ టూవీలర్‌పై డ్రగ్స్ విక్రయించినట్టు ఈగల్ టీమ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. మహబూబ్‌నగర్‌లోని కల్లు కాంపౌం డ్ యజమానికి పెద్ద మొత్తంలో మత్తు మందు అమ్మినట్టు తెలిపారు. జయప్రకాశ్ అరెస్ట్ తర్వాత స్కూల్లో చేసిన సోదాల్లో ఈగల్ టీమ్ రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నది. ఆ మొత్తాన్ని జయప్రకాశ్ ఫ్యాక్టరీలో పాత పేపర్ల మధ్య దాచినట్టు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ కేసు నేపథ్యంలో మేధా స్కూల్‌పై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. స్కూల్ లైసెన్స్ రద్దు చేసి, సీజ్ చేసింది. మేధా స్కూల్లో చదువుతు న్న 130 మంది విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మేడ్చల్ మల్కాజిగిరి డీఈవో విజయకుమారి తెలిపారు.