హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): వ్యాధితో బాధపడే వ్యక్తికి కచ్చితమైన ఔషధాలను సూచించడంలో జెనెటిక్ పరీక్షలు కీలకపాత్ర పోషిస్తాయని, ఈ పరీక్షల ద్వారా సదరు రోగికి ఏ మందులు పనిచేస్తాయో తెలుసుకోవచ్చని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. వ్యాధులకు సంబంధించిన సరైన ఔషధాలను తెలుసుకునేందుకు ఏఐజీ వైద్యబృందం దాదా పు 2000 మందికి పైగా రోగులపై అధ్యయనం చేసినట్టు ఆయన వివరించారు. ఔషధాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా పనిచేస్తాయి.
ఒక వ్యక్తిపై బాగా ప్రభావం చూపే ఒకే ఔషధం మరొకరికి హానికరంగా పరిణమించవచ్చు. సాధారణ ఔషధాలకు రోగి శరీరం ఎలా స్పందిస్తుందో అంచనా వేయడానికి ఫార్మాకోజెనొమిక్స్ పరీక్ష ద్వారా జన్యుసంకేతాన్ని విశ్లేషించవచ్చని తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో రూ.80 వేలు అయ్యే ఈ పరీక్షను తమ వద్ద రూ.5000కే చేయవచ్చని పేర్కొంది. ఈ పరీక్ష ఫలితాలను భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగించవచ్చని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డీ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్ష కోసం దాదాపు రెండువేల మందిపై అధ్యయనం చేశామని వెల్లడించారు. తమ అధ్యయనంలో పాల్గొన్న 30 శాతం మంది తీసుకుంటున్న ఔషధాలు వారి జన్యు నిర్మాణానికి అనుగుణంగా లేవని చెప్పారు.
మరి కొంతమందిలో మోతాదును పెంచాల్సి ఉండగా, ఇంకొంతమందికి తగ్గించాల్సి వచ్చిందని వివరించారు. ఈ హెచ్చుతగ్గుల వల్ల రోగి సైడ్ ఎఫెక్ట్స్ గురైనట్టు తెలిపారు. ఈ ఫార్మాకోజెనోమిక్స్ పరీక్ష ద్వారా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, జీర్ణశయాంతర రుగ్మతలు, నాడీ సంబంధిత మరియు మానసిక సమస్యలు, నొప్పి నిర్వహణ కోసం సాధారణ మందులకు వారి శరీరం ఎలా స్పందిస్తుందో అంచనా వేయడానికి రోగి జన్యు కోడ్‌ను విశ్లేషిస్తుందని వివరించారు. ఈ పరీక్ష ఫలితాలను భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగించవచ్చని, వాటిని ఏ వైద్యుడికి, ఎకడైనా చూపవచ్చు, భవిష్యత్తులో ప్రిస్రిప్షన్ లన్నీ వారి జన్యు ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉండనున్నట్టు వివరించారు.