శేరిలింగంపల్లి, ఆగస్టు 16: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు జరుపుతున్న ఓ ముఠాను ఎస్వోటీ మాదాపూర్, రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో డ్రగ్ పెడ్లర్లు దినేశ్ చౌదరి (సైనిక్‌పురి), గణేశ్ చౌదరి (ఘట్కేసర్), మంగళరామ్ (రాజస్థాన్)తోపాటు డ్రగ్స్ కొనుగోలుదారులు నితిన్ గుర్జార్ (గచ్చిబౌలి టెలికం నగర్), ప్రకాశ్ చౌదరి (సైదాబాద్), జైవట్రం వస్నరామ్ దేవసి (అమీన్పూర్), దినేశ్ చౌదరి (సైనిక్‌పురి), బనారామ్ చౌదరి (భువనగిరి) ఉన్నట్టు మాదాపూర్ డీసీపీ జీ వినీత్, ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిందితుల నుంచి 620 గ్రాముల హెరాయిన్ పేస్ట్, మహీంద్రా ఎక్స్‌యూవీ కారు, 7 సెల్ఫోన్లు సహా మొత్తం రూ.4.65 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుల్లో ఐదుగురికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్టు చెప్పారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని గణేశ్ చౌదరికి చెందిన లైట్‌హౌజ్ ఎలక్ట్రికల్ షాపులో డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుపుతుండగా వీరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని, రాజస్థాన్‌కు చెందిన ప్రధాన నిందితుడు సావర్జాట్ పరారీలో ఉన్నాడని వివరించారు.
డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని ఎస్టీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్టు ఎక్సైజ్‌శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. మరో కేసులో 1,200 కిలోల బెల్లం, 50 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన పీవీ రాహుల్, మహేశ్.. కూకట్‌పల్లికి చెందిన పలువురికి 29.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను తీసుకొస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు తెలిపారు. ఈ కేసులో నితిన్‌రెడ్డి, నైజీరియాకు చెందిన జాక్సన్ ప్రమేయం ఉందని, వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డ్రగ్స్ విలువ సుమారు రూ.4.50 లక్షలు ఉంటుందని తెలిపారు. కొల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పెద్దకొత్తపల్లికి కర్ణాటక నుంచి బొలెరోలో తరలిస్తున్న లక్షన్నర విలువైన బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.