Road Accidents | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రమాదాల్లో నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తీసుకొస్తున్నదని తెలంగాణ రోడ్డుభద్రత నివేదిక-2024 స్పష్టంచేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం రోడ్డు ప్రమాద మృతుల్లో ద్విచక్ర వాహనదారులే 53 శాతం వరకు ఉన్నారని తెలిపింది. నిరుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 7,156 మంది ద్విచక్రవాహనదారులు చనిపోయారని పేర్కొంది. అన్ని కేసుల్లోనూ వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రా ణాలు పోయినట్టు నివేదిక స్పష్టంచేసింది. ఆటోలు, లారీలు, ట్రక్కులు, బస్సుల వల్ల 6510 ప్రమాదాలు జరిగినట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 895 రోడ్డు ప్రమాదాలు జరిగాయని నివేదిక తెలిపింది.
కిల్లర్ సెల్ఫోన్..
సెల్ఫోన్ మాట్లాడుతూ, పాటలు వింటూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది మృత్యువాతపడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే సెల్ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని రవాణాశాఖ అవగాహన కల్పిస్తున్నది. సెల్ఫోన్ వినియోగిస్తూ వాహనాలు నడిపితే రూ.1000 జ రిమానా విధిస్తున్నది. లైసెన్సులో 2 పాయింట్లను నమోదు చేస్తున్నది. ఈ పాయింట్లు 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తున్నది. కానీ చాలామంది మారడం లేదు. ఈ-డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్, ట్రాఫిక్ పోలీసుల అధ్యయనం ప్రకారం 100 వాహనదారుల్లో 15 మంది సెల్ఫోన్లు వాడుతూ వాహనాలు నడుపుతున్నారు. సెల్ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం వల్ల 2024లో 26 వేల రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 7,700 మంది చనిపోయారు. మరో 20వేల మందికిపైగా గాయాలయ్యాయి.