IICT | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): గాలిలో తేమను తాగునీటిగా మార్చి ముంబై వాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త సాంకేతికతకు రూపకల్పన చేసింది. మేఘదూత్గా పిలిచే ఈ వాటర్ ప్లాంట్లు గాలిలో తేమను గ్రహించి నీటిగా మార్చి, పోషకాలు నష్టపోకుండా ఫిల్టర్ చేస్తాయి. ఈ వాటర్ ప్లాంట్లను మైత్రీ ఆక్వాటెక్ సంస్థతో కలిసి ముంబైలోని ఆరు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఐఐసీటీ అందుబాటులోకి తేనున్నది.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత ఛత్రపతి శివాజీ టెర్మినస్ ప్లాట్‌ఫాం-1లో ఏర్పాటు చేశారు. వాతావరణం నుంచి నీటిని ఉత్పత్తి చేసే మేఘదూత్ గేమ్ చేంజర్‌గా నిలవనున్నదని ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సామాన్యుడికి మంచినీటిని అందించే వ్యవస్థగా మారుతుందన్నారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో ఈ విధానంలో మంచినీటిని ఉత్పత్తి చేసి, ప్రజల దాహార్తి తీర్చవచ్చని తెలిపారు.