హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : సమక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ(గిరిజన యూనివర్సిటీ) అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు వర్సిటీ మొదటి వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ వైఎల్ శ్రీనివాస్ తెలిపారు. వర్సిటీ నిర్మాణానికి బృహత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తొలి వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. జీరో వేస్ట్, సెల్ఫ్ సస్టేనింగ్ గ్రీన్ క్యాంపస్‌గా కొత్త క్యాంపస్‌ను తీర్చిదిద్దనున్నామని, పూర్తి పర్యావరణహితంగా క్యాంపస్‌ను అభివృద్ధిచేస్తామని చెప్పారు.
వర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల అటవీ స్థలానికి బయోఫెన్సింగ్, 287 ఎకరాల స్థలానికి ప్రహరీ నిర్మిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్తో టోపోగ్రఫిక్ సర్వేను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం వర్సిటీ తా త్కాలిక క్యాంపస్‌లో నడస్తున్నదని, రెండు విడతల్లో (ఫేజ్‌ల్లో) కొత్త క్యాంపస్ నిర్మాణం జరుగుతున్నదని పేర్కొన్నారు. త్వరలోనే ప్రధాని మోదీ చేతులు మీదుగా శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అక్టోబర్‌లో నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశమున్నదని వెల్లడించారు.
2023లో వర్సిటీని ఏర్పాటు చేయగా, ప్రస్తుతం రెండు కొత్త కోర్సులు నిర్వహిస్తున్నామని, మరో 6 కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయని, ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సులేనని పేర్కొన్నారు. బీఈ(ఇంజినీరింగ్), ఎంఏ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ అప్లయిడ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ మెడ్‌టెక్, ఎంఏ డెవలప్మెంటల్ స్టడీస్ (ఎకనామిక్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్స్, పొలిటికల్‌సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గణితం, స్టాటిస్టిక్స్), ఎంఏ డిజిటల్ హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ వంటి కోర్సులను వర్సిటీలో ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. కోర్సుల డిజైన్ సహా వాటి నిర్వహణకు ప్రతిష్టాత్మక సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఐఐటీహెచ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఐఐసీటీ, ఆస్కీ, ఎన్ఐటీ వరంగల్, ఐఎస్బీ వంటి సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.