హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో (స్థానిక సంస్థల్లో) బీసీల ప్రాతినిధ్యం, పొందిన అవకాశాలపై ఆయా శాఖల వద్దనున్న సమాచారాన్ని, గణాంకాలను అందజేయాలని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల ను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బీసీల స్థితిగతులపై చేపట్టిన సమగ్ర అధ్యయనంలో భాగస్వాములు కావాలని కోరారు.
బీసీల సామాజిక స్థితిగతులపై శాస్త్రీయంగా అధ్యయనం చేపట్టి, సమగ్రమైన సిఫారసులతో నివేదికను సమర్పించాలని బీసీ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్దేశించింది. సమాచార సేకరణలో భాగంగా ఖైరతాబాద్‌లోని తమ కార్యాలయంలో బీసీ కమిషన్ వివిధ ప్రభుత్వ విభాగాధిపతులతో నాలుగు రోజులుగా సమావేశాలను నిర్వహిస్తున్నది. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ, జీహెచ్ఎంసీ, పౌరసరఫరాలశాఖ, సెర్ప్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ, గిరిజన సంక్షేమశాఖ, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ, ప్రణాళికశాఖ, వ్యవసాయశాఖ, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్యా మండలి, ఉపాధి, శిక్షణ, మహిళాభ్యుదయ, శిశు సంక్షేమశాఖలతో సమావేశాలను నిర్వహించింది.
బీసీ సంక్షేమశాఖ అధికారులతో భేటీ
కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కిశోర్‌గౌడ్ శనివారం బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సభ్య కార్యదర్శి అలోక్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారులతో భేటీ అయ్యారు. అమలవుతున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల తీరుతెన్నులు, కులాలవారీగా లబ్ధిదారుల వివరాలు, నిధుల కేటాయింపు, తదితర వివరా లు, విద్యార్థులు, ఉద్యోగుల వివరాలు, వివిధ అంశాలవారీగా సమీక్షించింది. కమిషన్ రూ పొందించిన ‘ప్రత్యేక ఫార్మాట్’ ప్రకారం వివరాలను సేకరించి ఇవ్వాలని కోరారు. సమావేశంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీ, వివిధ కార్పొరేషన్, ఫెడరేషన్ విభాగాల అధికారులు మల్లయ్య భట్టు, చంద్రశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, విమలాదేవి, డీఆర్ ఉదయ్‌కుమార్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.