నిర్మల్ చైన్‌గేట్, జూన్ 4: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక అవినాష్ ప్రతిష్ఠాత్మకమైన మిస్సెస్ వరల్డ్ పీస్-2024 అందాల పోటీల్లో రాణించి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్లో గ్లామర్ గుర్గావ్ సంస్థ ద్వారా మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఫైనల్స్‌కు చేరుకున్న 140 మంది పోటీదారులలో చంద్రిక అవినాష్ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి మిస్సెస్ ఇంటలెక్చువల్ సబ్ టైటిల్, మిస్సెస్ వరల్డ్ పీస్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను అనునిత్యం ప్రోత్సహించి ధైర్యాన్నిచ్చిన తన భర్త డాక్టర్ అవినాష్, అత్త దేవీబాయి, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. తన గురువు మెంటర్, గ్లామర్ గుర్గావ్ డైరెక్టర్ బార్ఖ నాంగియా ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.