హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): క్షౌర వృత్తిలోకి రిలయన్స్ పెట్టుబడిదారులతోపాటు ఇతర వర్గాల వారెవరూ రాకుండా చూడాలని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు కోరారు. నాయీ బ్రాహ్మణులే క్షౌర వృత్తిని చేసుకొనేలా జీవో తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, పలువురు నేతలు హైదరాబాద్‌లో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 70 వేల కటింగ్ షాపుల్లో దాదాపు 2లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. సంప్రదాయక మంగలి కులవృత్తిలోకి పెట్టుబడిదారులు, ఇతర వర్గాలవారు వస్తే తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని వాపోయారు. రిలయన్స్ వేలాది కటింగ్ షాపులు పెట్టే దిశగా చర్యలు చేపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.