హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): ముందస్తు అనుమతి లేనిదే తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హైదరాబాద్లోని సొసైటీ ప్రధాన కార్యాలయానికి రావద్దని హెచ్చరిస్తూ విద్యాలయాల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆమె ప్రత్యేకంగా సర్క్యూలర్ జారీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్ ముందస్తు అనుమతి పొందాలని, ప్రిన్సిపాల్ నుంచి సెలవు మంజూరు ఉండాలని, కార్యాలయానికి ఎందుకు వస్తున్నదీ అనే విషయాన్ని కార్యాలయ ప్రవేశద్వారం వద్ద ఉంచిన సందర్శకుల రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేసి సంతకం చేయాలని ఆమె ఆదేశించారు. సెక్రటరీ హెడ్ ఆఫీస్లో లేకుంటే అదనపు కార్యదర్శిని కలవాలని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షలు, పాఠశాల పనిదినాల్లో కూడా కొందరు ఉద్యోగులు సొసైటీ ప్రధాన కార్యాలయానికి వచ్చి చికాకు పెడుతున్నారని, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో జరిగే సాధారణ సమావేశాలకు ఎప్పటికప్పుడు ఆర్సీవో, డీసీవోలు హాజరుకావాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యగా పరిగణిస్తామని సిబ్బందిని సెక్రటరీ సీతాలక్ష్మి హెచ్చరించారు. సమస్యలను విన్నవించుకోవడానికి కార్యాలయానికి వస్తే కూడా తప్పేనా అని చర్చించుకుంటున్నారు.