హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీ కుల జాబితాలోని 51 కులాలను డీనోటిఫైడ్ ట్రైబ్స్(విముక్త జాతులు), నోమాడిక్ ట్రైబ్స్(సంచార జాతులు), సెమి నోమాడిక్ ట్రైబ్స్(అర్ధ సంచార జాతులు)గా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సంచార, అర్ధ సంచార తెగల అభ్యున్నతి కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా స్కీమ్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీఎన్టీ(సీడ్) పథకాన్ని అమలు చేస్తున్నది. స్కీమ్ కింద లబ్ధి పొందాలంటే డీఎన్టీ(డీనోటిఫైడ్ ట్రైబ్స్) కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం డీఎన్టీ పేరిట కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని సంచార, అర్ధసంచార ఎంబీసీ కులాలు సీడ్ పథకాన్ని వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. దీంతో డీఎన్టీ సర్టిఫికెట్లను జారీ చేసేలా చూడాలని జాతీయ డీఎన్టీ బోర్డు సైతం ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కమిషన్కు కూడా సూచించింది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ డీఎన్టీ జాబితా రూపొందించింది. రాష్ట్రంలో మొత్తంగా 51డీఎన్టీ కులాలు ఉన్నాయని బీసీ కమిషన్ నిర్ధారించింది. వాటిలో ప్రధానంగా బీసీ ‘ఏ’ జాబితాలో 49కులాలు, బీసీ ఈ గ్రూపులో 2 కులాలను డీఎన్టీలుగా కమిషన్ గుర్తించింది. వాటికి డీఎన్టీ సర్టిఫికెట్లను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం, ఆ ప్రతిపాదనలకు ఇటీవల క్యాబినెట్ సైతం ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా తాజాగా డీఎన్టీ కుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో 10ని జారీ చేసింది.
20న జాతీయ లోక్ అదాలత్
హైదరాబాద్ , జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు న్యాయవ్యవస్థ, పోలీసులు, ప్రాసిక్యూషన్, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్ కోషి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన వర్చువల్ విధానంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి లోక్ అదాలత్ ఏర్పాట్లను పరిశీలించారు. రాజీ ద్వారా పరిషరించగలిగే కేసులను గుర్తించి లోక్ అదాలత్లకు తరలించాలని సూచించారు. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి 23 వరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ‘సమాధాన్ సమారోహ్-2026’ను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిషారానికి ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని తెలిపారు. సమావేశంలో డీజీపీ, సీవీ ఆనంద్, అదనపు డీజీపీలు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, జిల్లా న్యాయసేవా సంస్థల చైర్పర్సన్లు, కార్యదర్శులు, తాలూకా న్యాయ సేవా కమిటీల ప్రతినిధులు, టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, పరిపాలనాధికారి వెంకట మల్లిక్ పాల్గొన్నారు.