హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దివ్య సన్నిధి కాంప్లెక్స్‌లో అత్యాధునిక వసతి సౌకర్యం అందుబాటులో ఉన్నదని వైటీడీఏ ఉపాధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి జీ కిషన్‌రావు తెలిపారు. వసతి సౌకర్యం కావాల్సిన భక్తులు వైటీడీఏ వెబ్సైట్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చని చెప్పారు. డోనర్స్ స్కీమ్ కింద నిర్మించిన 15 కాటేజీల్లో 75 సూట్లు ఉన్నాయని, వీటిని బుక్ చేసుకొన్నవారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఒక్కొక్క కాటేజీలో ఐదు ఫుల్లీ ఫర్నిష్డ్ విశాలమైన సూట్లు, ఐదు బెడ్రూమ్లు, అధునాతన వంటగది, డైనింగ్‌హాలు, డ్రాయింగ్ రూమ్, వెయిటింగ్ లాంజ్ ఉన్నాయని వివరించారు. కాటేజీ నుంచి ఆలయం కనిపించేలా చక్కని వ్యూ ఉంటుందని తెలిపారు. కాటేజీల చుట్టూ పచ్చిక లాన్లు, అన్ని విల్లాలకూ సీసీ కెమెరాలు, ఎస్కార్టెడ్ దర్శన సౌకర్యంతో పాటు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చక్కని సేవలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో తగిన వసతి సౌకర్యం లేదంటూ వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు.