మొత్తం 39,829
రెండు లక్షలు దాటనున్న ఉద్యోగాలు
ఏడేండ్లలోనే 1,31,159 పోస్టుల భర్తీ
హైదరాబాద్, మార్చి 9 : ఉద్యోగ నియామక వ్యవస్థలో సీఎం కేసీఆర్ తన రికార్డును తానే తిరగరాశారు. 2014 నుంచి 2020 వరకు ఏడేండ్లలోనే లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డును నెలకొల్పిన సీఎం కేసీఆర్.. బుధవారం మరో 80,039 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. మొత్తంగా ప్రభుత్వం 91,142 ఉద్యోగాలను నోటిఫై చేసింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2020 వరకు.. ఏడేండ్లలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇప్పటికే 1,31,159 పోస్టులను భర్తీ చేసింది. మరో 26,116 పోస్టులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఐటీ మినహా అన్ని శాఖల్లో కొలువుల భర్తీ
రాష్ట్రంలో 28 ప్రధాన శాఖలు ఉండగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ (ఐటీ) విభాగం మినహా 27 శాఖల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలన్నీంటిని భర్తీచేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. 27 శాఖల్లో జిల్లా, జోన్, మల్టీ జోన్లలో 80,039 ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్నాయి.
ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ప్రకటనతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారమైంది. కేసీఆర్ ఉద్యోగ ప్రదాతగా నిలిచారు. పోరాడి సాధించుకొన్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కల నెరవేరింది. కేసీఆర్ దార్శనికతతో రాష్ట్ర ప్రజల కల సాకారమైంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–నామా నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత
దేశం అబ్బురపడే ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వెలువరించిన ఉద్యోగ నియామకాల ప్రకటన దేశం అబ్బురపడే స్థాయిలో ఉంది. తాజా ఉద్యోగ ప్రకటనతో ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదానికి మరింత సార్థకత చేకూరింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన మంత్రంతో కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రం సాధించారు. గత ఏడేండ్లలో అనేక నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించటం ద్వారా గొప్ప సంపదను సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన లక్షకుపైగా ఉద్యోగాలు కాకుండా తాజాగా 91,142 పోస్టుల నోటిఫికేషన్ల ప్రకటన ద్వారా నిరుద్యోగులకు మరో బహుమతి వచ్చింది. పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ నిర్ణయం సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం. ఇది ఉద్యోగనామ సంవత్సరం. యువతకు శుభాకాంక్షలు.
– జోగినపల్లి సంతోష్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు
నిరుద్యోగులకు తీపి కబురు
ఉద్యోగాల భర్తీ ప్రకటన ద్వారా సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించినట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగం 7.2 శాతం ఉంటే, తెలంగాణలో 2.2 శాతం మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ శాఖల్లో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకటి ఖాళీగా ఉంది. వాటిని వెంటనే భర్తీ చేయాలి. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్, తాజాగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో తీపికబురు చెప్పారు. ఒకేసారి ఇంత భారీస్థాయిలో ఉద్యోగ భర్తీ ప్రకటన చేయడం గొప్ప విషయం. దీన్ని రాష్ట్రంలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు సాధించేలా ఉత్తమ శిక్షణ పొందాలి. – గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
ఇంత భారీస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. గురువారం సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరతా.
– జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
ఉపాధ్యాయుల పదోన్నతులు, 13,086 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఒకే సారి 80,039 నియామకాలు చేపట్ట బోతున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిషరిస్తామని అసెంబ్లీలో ప్రకటించడం చారిత్రాత్మకం. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టడం తెలంగాణ విద్యా రంగానికి శుభసూచకం. ముఖ్యమంత్రి పీఆర్టీయూ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
– కూర రఘోత్తంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
కాంగ్రెస్, బీజేపీ నాయకులు దరఖాస్తు చేసుకోండి
కేసీఆర్ అంటే కొత్త చరిత్ర. కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు. సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటిస్తే ముక్కు నేలకు రాస్తానన్న బండి సంజయ్, గన్‌పార్క్ ముందు ముక్కు నేలకు రాయాలి. వయో పరిమితి పెంచిన దృష్ట్యా రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న బీజేపీ నాయకులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. కేసీఆర్ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు పని లేకుండా పోయింది. ఇది వాళ్లకు చీకటి రోజు. సీఎం కేసీఆర్ కలలు కన్న నీళ్లు, నిధులు, నియామకాల తెలంగాణ నేటితో సాకారమైంది. నిరుద్యోగులు మార్చి 9న పండుగలా వేడుకలు చేసుకోవాలి. ఆర్మూర్ నియోజకవర్గ నిరుద్యోగుల కోసం సొంత ఖర్చులతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయిస్తా.
– ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దు
మంచిపనులను ఆస్వాదించే నైజం ప్రతిపక్షాలకు లేదు. కాంగ్రెస్ నాయకులు వాళ్ల హయాంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. యువతను తమ పార్టీలవైపు ఆకర్షించుకొని రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు వారి మాటలు పట్టించుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అచ్చంపేట నిరుద్యోగ యువత కోసం సొంత ఖర్చులతో భోజన వసతితో కోచింగ్ ఇప్పిస్తా.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాహసోపేత నిర్ణయం
సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం గొప్ప విషయం. పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటిండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల పక్షాన, రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ధన్యవాదాలు. – గణేశ్ బిగాల, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే