Khammam | న్యూస్‌నెట్‌వర్క్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అధికారుల అప్రమత్తతతో ఖమ్మం నగరానికి వరద ముప్పు తప్పింది. వారం కిత్రం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా తేరుకోకముందే.. మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కుండపోతను తలపించేలా ఖమ్మం జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుం చి నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలతో వణికిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ఖమ్మం మున్నేరు ప్రవాహం శనివారం రాత్రే మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. దీంతో అధికారులు అప్రమత్తమై దాని పరీవాహక ప్రాంతాల ప్రజలను మైకులతో అలర్ట్ చేశారు. మున్నేరు ముంపు ప్రాంతాలైన కాల్వొడ్డు, బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ధంసలాపురం, రాజీవ్‌గృహకల్ప, దానవాయిగూడెం, కాలనీల్లోని ప్రజలను ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం అర్ధరాత్రే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వారిని కందగంట్ల ఫంక్షన్ హాల్, ప్రభు త్వ మహిళా డిగ్రీ కళాశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉంచారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల వరకు మున్నేరు వరద 16 అడుగులకు చేరుకుంది. ఆ తరువాత నిలకడగా ఉండి ఆదివారం సాయంత్రం వరకు పెరగకపోవడంతో అధికారులు, ముంపు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 5.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తల్లాడలో రికార్డు స్థాయిలో 12.62 సెం.మీ. వర్షం కురిసింది. జూలూరుపాడు మండలం రాంపురం-ఏలకలొడ్డు పరిధిలోని పశువుల కాపరులు, పోడుసాగుదారులు వాగు దాటేందుకు వీలుకాకపోవడంతో అడవిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాణాప్రతాప్ సిబ్బందితో కలిసి వారిని సురక్షితంగా ఒడ్డు చేర్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్వాడ సమీపంలోని సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తడంతో ఆరుగురు రైతులు ఎడ్లబండితో సహా వరదలో చిక్కుకున్నారు.
గ్రామస్థులు తాళ్ల సాయంతో ఎడ్లబండిని, రైతులను సురక్షితంగా కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలోని దుందుభీ వాగులో చిక్కుకున్న తొమ్మిది మందిని ఎస్సై మహేశ్ కాపాడారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ శివారులో ఎస్సారెస్పీ డీబీఎం-31పై ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం శ్యామ్‌నగర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడి పొనగంటి సులోచన (44) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గుమ్మెనంగ్లాపూర్కు చెందిన రైతు దత్తురి గురువయ్య(50)కు శనివారం రాత్రి గుండెపోటు వచ్చింది. గుమ్మెనంగ్లాపూర్ గ్రామ శివారులో దోత్తివాగు ఉధృతంగా ప్రవహించడంతో దవాఖానకు తీసుకెళ్లడానికి వీలుకాలేదు. దీంతో గురువయ్య అక్కడిక్కడే మృతిచెందాడు.