హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : డిస్కమ్‌ల వడ్డింపులతో రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గడ్డుకాలం దాపురించింది. తాజాగా 50 హెచ్‌పీ దాటితే హైటెన్షన్ (హెచ్‌టీ) మీటర్లు పెట్టుకోవాలనే ఆదేశాలు, ఇప్పటికే చర్లపల్లి సహా పలు ఇండస్ట్రియల్ ఏరియాల్లో విద్యుత్తు ఇంజినీర్లు నోటీసులివ్వడంపై పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 49 హెచ్‌పీ లోపు ఉన్న వినియోగదారులకు లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలోనే త్రీఫేజ్ విద్యుత్తు అందిస్తుండగా, చిన్న వర్క్‌షాప్‌లు, పలు ఆగ్రో బేస్డ్ ఫ్యాక్టరీలు, ఇతరత్రా మ్యానుఫ్యాక్చరింగ్ యూ నిట్లన్నీ ఆ కేటగిరీలోనే నడుస్తున్నాయి. సుమారు పదేండ్ల కిందట నుంచే కనెక్షన్లు తీసుకుని రన్ చేస్తున్న వాటి స్థానంలో ఇప్పుడు హెచ్‌టీ మీటర్లు పెట్టుకోవాలంటే కొత్తగా ట్రాన్స్ఫార్మర్, బ్రేకర్, ఇతరాత్ర సామగ్రి సమకూర్చుకోవాల్సి రావడంతో పరిశ్రమలకు తలకుమించిన భారమే కాగా ఒక్కో వినియోగదారుడిపై రూ.7 లక్షల వరకు భారం పడనున్నది. ఇప్పటికే ఆర్డర్లు లేక ఇబ్బందులుపడుతుండగా డిస్కమ్ అధికారుల తీరుతో మరింత కుదేలయ్యే ప్రమాదం ఉందని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.
విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ సర్కార్ పరిశ్రమలనే లక్ష్యంగా చేసుకుని బిల్లులు వడ్డిస్తున్నది. ఇప్పటికే టైమ్ ఆఫ్ ది టారిఫ్ (టీవోడీ)లో మార్పులు చేసి, హైటెన్షన్ వినియోగదారులకు ఇచ్చే నైట్ అలవెన్స్‌కు కోతపెట్టింది. రాత్రిపూట విద్యుత్తును వినియోగించుకున్నందుకు పరిశ్రమలకు అందించే రూ.1.50 అలవెన్స్‌ను డిసెంబర్ 1 నుంచి పూర్తిగా రద్దుచేసింది. దీంతో బిల్లులు ఐదు నుంచి పదిశాతం పెరిగాయి. అదే సమయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రం యూనిట్‌కు రూపాయి అదనంగా వసూలు చేస్తున్నది. ఇదిలా ఉండగా ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.0.59 సర్‌చార్జి వసూలు చేసేందుకూ రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిస్కమ్‌లు ఈఆర్సీలో పిటిషన్లు దాఖలు చేయడంతో ఆ భారం కూడా పరిశ్రమలపైనే పడనున్నది.
పవర్ ఫ్యాక్టర్ అన్‌లాకింగ్‌తో పరిశ్రమలకు సమస్య చుట్టుముట్టాయి. బిల్లులు పెరిగాయి. ఇప్పటి దాకా హెచ్‌టీ వినియోగదారులకు కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) బిల్లింగ్ ఉండగా, తాజాగా కిలోవాట్ అంపియర్ అవర్ (కేవీఏఆర్‌హెచ్) బేస్డ్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టారు. మీటర్లలో లాక్ వేసి ఉన్న లీడింగ్ పవర్ ఫ్యాక్టర్‌ను ఇప్పుడు అన్‌లాక్ చేశారు. దీంతో అన్ని పరిశ్రమల బిల్లులు పెరగ్గా కొన్నింటివి 600 శాతం, మెజారిటీ పరిశ్రమల బిల్లులు 300 శాతం పెరుగడంతో పారిశ్రామికవేత్తలు గగ్గోలుపెడుతున్నారు. ఆ బిల్లులను చెల్లించబోమని, ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.