యాదాద్రి, ఆగస్టు 19: యాదగిరిగుట్ట క్షేత్రం ఒక అద్భుతమైన కట్టడమని, ఇలాంటి ఆలయాన్ని పునర్నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్నీ శుభాలే జరగాలని దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు ఆకాంక్షించారు. ఈ ఆలయ పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. ‘వాంటెడ్ పండుగాడు’ సినిమా విడుదల నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని శుక్రవారం ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం శ్రావణమాసం సందర్భంగా చేపట్టిన శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకుడు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్రావు మాట్లాడుతూ.. ప్రతి సినిమా విడుదల, ప్రారంభ సమయంలో లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొంటానని తెలిపారు.
స్వయంభువుగా వెలిసిన పంచనారసింహుడి క్షేత్ర మహిమపై దర్శకుడు రాఘవేందర్రావు ఆరా తీశారు. క్షేత్ర విశిష్ఠతను ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులును అడిగారు. స్వామివారు వెలిసిన తీరు, ప్రహ్లాద చరిత్ర, యాదమహర్షి చరిత్ర, ఆలయ విశిష్టత వివరాలను తెలుసుకొన్నారు.