Diljit Doshanj | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ శుక్రవారం శంషాబాద్‌లో నిర్వహించిన కాన్సర్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. ‘దిల్-లుమినాటి టూర్’లో భాగంగా శంషాబాద్‌లోని ఒక హోటల్ల్లో శుక్రవారం దిల్జిత్ కాన్సర్ట్ నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించే పాటలు పాడొద్దంటూ దిల్జిత్తోపాటు ఈవెంట్ నిర్వాహకులకు రంగారెడ్డి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. గత అక్టోబర్ 26, 27 తేదీల్లో ఢిల్లీలో దిల్జిత్ నిర్వహించిన షోపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నిర్వహించిన షోలో మద్యం, డ్రగ్స్, హింస, తుపాకీ సంస్కృతిని హీరోయిజంగా కీర్తిస్తూ ‘పాటియాలా పెగ్’, ‘పంజ్ తారలా’ వంటి పాటలు ఆలపించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడ మద్యం బాటిళ్లు కుప్పల్లా దర్శనమిచ్చాయి.
అభిమానులు కుర్చీలు విరగ్గొడుతూ శృతిమించి ప్రవర్తించారు. ఆయా దృశ్యాలను వీడియోల రూపంలో ఆధారాలుగా రూపొందించి చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ ఒకరు తెలంగాణ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా షోలు సమాజంపై దుష్ప్రభావం చూపుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకున్న తెలంగాణ అధికారులు దిల్జిత్‌కు నోటీసులు జారీచేశారు. మాదకద్రవ్యాలను ప్రోత్సహించేలా పాటలు పాడకూడదని ఆంక్షలు విధించారు. లైవ్‌షో సమయంలో పెద్దగా మ్యూజిక్ ఏర్పాటు చేయొద్దని, 140డీబీ కంటే సౌండ్ ఉండకూడదని పరిమితులు విధించారు. పిల్లలను వేదికపైకి అనుమతించొద్దని సూచించారు. దీంతో దిల్జీత్ షోపై ఆంక్షల నేపథ్యంలో నిరాశ చెందిన ఆయన అభిమానులు సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తంచేశారు. ఇలా ఆంక్షలు విధిస్తే హైదరాబాద్‌లో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడానికి ఎవరూ ముందుకురారంటూ చిర్రుబుర్రులాడారు.