హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు భానుడు నిప్పులు కక్కుతుండగానే.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 3.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, నల్గొండలో 3.58 సెంటీమీటర్లు, వనపర్తి 3.48 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్ 3.33 సెంటీమీటర్ల వాన పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా ఎనిమిది జిల్లాల్లో వానలు పడినట్టు చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి పొడివాతావరణం ఉండగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు ఇబ్బందిపెట్టాయి. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను మరింత ఉద్ధృతమైతున్నది. ఈ తుఫాను ప్రభావం ప్రస్తుతానికి తెలంగాణపై ఉండదని అధికారులు చెప్తున్నారు. రాబోయే మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొన్నారు.