హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన గణపతి త్వరగా లొంగిపోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి మరోసారి బహిరంగంగా విజ్ఞప్తిచేశారు. గణపతితో సహా రాష్ట్రం నుంచి నలుగురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు. వారిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, జోడె రత్నాబాయి అలియాస్ సుజాత, వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు ఉన్నట్టు వెల్లడించారు. డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట శనివారం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దండకారణ్యం స్పెషల్జోనల్ కమిటీకి చెందిన 47మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారు 32 తుపాకులతోపాటు 515 తూటాలను పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ పునరావాస ప్యాకేజీ కింద అందరికీ కలిపి సుమారు రూ. కోటిన్నర నగదును రివార్డుగా అందిస్తున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇస్తున్నట్టు తెలిపారు.